వెండితెర వేదికపై నాద వినోదం… నాట్య విలాసం

SSM-1

 

సాగర సంగమం చిత్రానికి 30 ఏళ్లు

ఓ సినిమా వెనకొచ్చే సినిమాలకు అనుసరణీయం, ఆచరణీయం అయితే… దాన్ని గొప్ప సినిమా అంటాం. అయితే… అనుసరణకు, ఆచరణకు సాధ్యం కాని గొప్ప సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటివి అరుదుగా వస్తుంటాయి. ఆ కోవకు చెందిన సినిమానే కె.విశ్వనాథ్ ‘సాగరసంగమం’. ఈ సినిమాను అనుసరించడం, అనుకరించడం, ఆచరించడం ఆ సాధ్యం. 
నదీమతల్లి సముద్రునిలో మమేకమవుతున్న దృశ్యం.. చూడటానికి ఎంత రమణీయంగా ఉంటుందో అంత రమణీయంగా ఉంటుందీ సినిమా. అందుకే దీనికి ‘సాగరసంగమం’ పేరు యాప్ట్. నిజానికి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఈ సినిమాకు ఆ పేరు అనుకోలేదు. భారతీరాజా దర్శకత్వంలో తాను నిర్మించిన ‘సీతాకోకచిలుక’ చిత్రానికి ఈ పేరు అనుకున్నారు. కానీ దైవనిర్ణయం వేరేలా ఉంది. కాశీనాథుని విశ్వనాథుడు తెరకెక్కించనున్న అద్భుత కళాత్మకసృష్టి కోసం దైవం ఈ పేరు అప్పుడే రిజర్వ్ చేసేసింది. 

కళాకారుడు సున్నిత మనస్కుడు… భావోద్వేగాన్ని ఆపుకోలేనివాడు. ఇందులో కమల్ పాత్ర పై స్వభావాలకు అద్దం పడుతుంది. సంతోషం వస్తే.. తన నాట్యంతో ప్రకృతిని పరవశింపజేస్తాడు. కోపం వస్తే… అదే నాట్యంతో పంచభూతాలను స్తంభింపజేస్తాడు. ప్రేమభావాన్ని దాచుకోలేడు. ‘నా’ అన్నవాళ్లు దూరమైతే భరించలేడు. తనకు తాను హింసించుకుంటూ, తనవారిని స్మరించుకుంటూ జీవితాన్ని గడిపేస్తాడు. పరిపూర్ణమైన కళాకారునికి బాలు పాత్ర నిలువుటద్దం. ఈ పాత్రలో కమల్ నటించలేదు, జీవించాడు. 

SSM

ఇందులో ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ ఇన్విటేషన్‌ని కమల్‌కి జయప్రద చూపించే సన్నివేశాన్ని ఎవ్వరన్నా మరిచిపోగలరా! ఆ ఇన్విటేషన్‌లో తన పేరును, తన రూపుని చూసుకున్న కమల్ భావోద్వేగానికి లోనై బాధని, ఆనందాన్ని ఒక్కసారే వ్యక్తం చేసే ఆ సన్నివేశంలో నటునిగా ఆకాశమంత ఎత్తులో కనిపిస్తారు కమల్. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లి ముందు గుండెల్లోని బాధనంతటినీ దిగమింగి కమల్ నాట్యం చేసే తీరు భారతీయ సినిమాకు మరో వందేళ్లు వచ్చినా మరిచిపోలేరన్నది అక్షర సత్యం. పేపర్ ఆఫీస్‌లో ఎడిటర్‌ని చావబాదే సన్నివేశం, ‘పంచభూతములు ముఖపంచకమై..’ అంటూ భారతీయ నృత్యరీతులన్నింటినీ శైలజ ముందు ప్రదర్శించే సన్నివేశం, వర్షంలో నూతిపై నాట్యమాడే దృశ్యం, తనలో అంతర్గతుడైన కళాకారుణ్ణి శైలజలో సాక్షాత్కరింపజేయడానికి క్లైమాక్స్‌లో బాలు పడే తపన… ఆ సన్నివేశాల్లో కమల్ నటన అమోఘం, అపూర్వం, అనితర సాధ్యం.

 

తెలుగుతెరపై ఇప్పటివరకూ వచ్చిన టాప్ టెన్ స్క్రీన్‌ప్లేల్లో ‘సాగరసంగమం’ స్క్రీన్‌ప్లే ఒకటని కచ్చితంగా చెప్పొచ్చు. ఇది ప్రేమకథాచిత్రమా? స్నేహకథాచిత్రమా? లేక కళాత్మక చిత్రమా? సమాధానం దొరకని ప్రశ్నలు ఇవి. 

ss-3 (2)

అసలు పూర్ణోదయా సంస్థ కోసం ఈ కథను తయారు చేసుకోలేదు విశ్వనాథ్. అల్లు అరవింద్, చేగొండి హరిరామజోగయ్య, వి.వి.శాస్త్రి కలిసి విశ్వనాథ్‌తో ఓ చిత్రం చేయాలనుకున్నారు. వారి సినిమా కోసం విశ్వనాథ్ ఈ కథ తయారు చేసుకున్నారు. అప్పుడు కూడా హీరోగా అనుకుంది కమల్‌నే. అయితే… ఆ ప్రాజెక్ట్ అప్పుడు కార్యరూపం దాల్చలేదు. తర్వాత కొన్నాళ్లకు ఏడిద నాగేశ్వరరావు ఓ సినిమా చేద్దామని అడగడంతో అప్పుడు ఈ కథ బయటకు తీశారు విశ్వనాథ్. నాగేశ్వరరావుకి కథ విపరీతంగా నచ్చేసింది. అయితే… కమల్ మాత్రం చేయనన్నారు. ముసలాడి పాత్ర చేస్తే అన్నీ అలాంటివే వస్తాయని భయం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ ఒప్పించడంతో చివరకు ‘సరే’ అన్నారు. అలాగే ఇందులో కథానాయిక ‘మాధవి’ పాత్రకు ముందు అనుకున్నది జయసుధను. కానీ చివరకు ఆ పాత్ర జయప్రదనే వరించింది. 

 

విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ, కమల్ నటన విశ్వరూపం తర్వాత ఈ సినిమా విషయంలో చెప్పుకోవాల్సింది ఇళయరాజా గురించి. ‘నాద వినోదము నాట్య విలాసము’, ‘వే వేల గోపెమ్మలా..’, ‘మౌనమేలనోయి…’,‘తకిట తథిమి తకిట తథిమి తందానా’, ‘వేదం అణువణువున నాదం’.. ఇలా ఇందులో ఆయన స్వరపరిచిన ప్రతి పాటా ఆణిముత్యమే. గోపికృష్ణ, శేషు, రఘు నృత్యాలు, తోట తరణి కళ, జంధ్యాల సంభాషణలు ఈ సినిమాకు ఆభరణాలు. ఇవన్నీ ఈ సినిమాను కళాఖండాన్ని చేశాయి. 
1983 జూన్ 3న ‘సాగరసంగమం’ విడుదలైంది. అంటే నేటికి ఈ సినిమాకు ముప్ఫైఏళ్ళు. తెలుగునాట 35 కేంద్రాల్లో వందరోజులాడిందీ సినిమా. మూడు కేంద్రాల్లో సిల్వర్‌జూబ్లీ నడిచింది.

తమిళ, మలయాళ, రష్యన్ భాషల్లో అనువాదమై తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసింది. కమల్ తొలిసారి ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకుంది ఈ సినిమాకే. ఇళయరాజా జాతీయ ఉత్తమ సంగీత దర్శకునిగా తొలిసారి అవార్డు తీసుకుందీ ఈ చిత్రానికే. శంకరాభరణం, ఏక్ దూజేకేలియా చిత్రాల తర్వాత ఉత్తమ గాయకునిగా ఎస్పీ బాలు జాతీయ పురస్కారం అందుకుంది కూడా ఈ సినిమాకే. ఈ సినిమాకు కె.విశ్వనాథ్‌ని తప్ప దర్శకునిగా మరొకర్ని ఊహించలేం. ఇందులోని బాలు పాత్రలో కమల్‌హాసన్‌ని తప్ప మరొకర్ని చూడలేం. ఎన్నిసార్లు చూసినా తనివితీరని కళాఖండం ‘సాగరసంగమం’. ‘నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్’ అని ప్రేక్షకులకు తెలియజేసిన హార్ట్‌ఫుల్ సినిమా ‘సాగరసంగమం’.
– బుర్రా నరసింహ

————————————————————————

సాక్షి దినపత్రికలోని ఈ వ్యాసం కింద లింక్ లో చూడచ్చు.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63421&Categoryid=2&subcatid=26

సాక్షి పత్రిక వారికి కృతజ్ఞతలతో

 

2 thoughts on “వెండితెర వేదికపై నాద వినోదం… నాట్య విలాసం

  1. Reblogged this on ఓ "గాలి" కబుర్లు:) and commented:
    సినిమాలు మన మీద ప్రభావం చూపుతాయి అంటే నేను ఎప్పుడు నమ్మలేదు . స్వానుభవం అయితే తప్ప తెలీదు అన్నట్టు నన్ను మార్చిన అతి కొద్ది సినిమాల్లో సాగర సంగమం ఒకటి.

వ్యాఖ్యానించండి